హైదరాబాద్:
నగరానికి చెందిన శశికాంత్ 2006లో హస్తినాపూర్‌లో 300 చదరపు గజాల స్థలాన్ని కొన్నాడు. అందులో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఇటీవల దరఖాస్తు చేస్తే ఎల్‌బీనగర్ పట్టణ ప్రణాళిక విభాగం తిరస్కరించింది. ఇదేమని ప్రశ్నిస్తే ఆ స్థలం ఉన్న లేఅవుట్‌కు అనుమతుల్లేవని స్పష్టం చేసింది...
మహా నగరంలో అక్రమ లేఅవుట్ల కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఆకర్షణీయమైన బ్రోచర్లతో కొనుగోలు చేసే వరకు వెంటాడే కొందరు రియల్టీ వ్యాపారులు తర్వాత తేరుకోలేని దెబ్బ కొడుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అన్నీ ఉన్నట్లుగా నమ్మించి నట్టేట ముంచుతున్నారు. సరిగా ధ్రువీకరించుకోకుండా కొనుగోలు చేసి తర్వాత ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేస్తే స్థానిక సంస్థలు అనుమతులివ్వడం లేదు. నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, ఘట్‌కేసర్, ఉప్పల్, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీపట్నం శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, చేవెళ్ల కొత్తూరు, చౌటుప్పల్, తదితర ప్రాంతాల్లో బూమ్ సమయంలో రియల్టీ వ్యాపారం ఊపందుకోవడంతో పెద్ద ఎత్తున లేఅవుట్లు వెలిశాయి. కొన్ని ప్రముఖ సంస్థలు నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుంటున్నా చాలామంది ఏమీ లేకుండా అమ్మకాలకు దిగుతున్నారు. ఇలా మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో 14వేల ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు సమాచారం. వీటిలో కొన్నింటిపై చర్యలు తీసుకునేందుకు రంగారెడ్డి జిల్లా పంచాయతీ అఫీసర్(డీపీఓ) సన్నాహాలు మొదలెట్టారు.
శివార్లలో అక్రమాలు..
నగరంలో ఇళ్ల స్థలాలు లేకపోవడంతో చాలామంది నగర శివారు ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇదే అదనుగా పలువురు రియల్ వ్యాపారులు శంషాబాద్, మహేశ్వరం, కొత్తూరు, షాద్‌నగర్, ఘట్‌కేసర్, చౌటుప్పల్ తదితర చోట్ల వ్యవసాయ భూములు కొనుగోలు చేసి లేఅవుట్లు వేశారు. మరికొందరు తాజాగా వేస్తున్నారు. నిబంధనల ప్రకారం హెచ్‌ఎండీఏ ఆమోదం ఉన్న లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇళ్ల నిర్మాణానికి కూడా హెచ్‌ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం అనుమతితో పాటు బ్యాంకు రుణాలు సులువుగా పొందే అవకాశం ఉంటుంది. కానీ కొనుగోలుదారులు ఇవేవీ పరిశీలించకుండా కొనుగోలు చేసి తర్వాత ఇబ్బందులుపాలవుతున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో గత ఆరు నెలల్లో ఇలా అనుమతి లేని లేఅవుట్లలో నిర్మాణాల కోసం చేసిన వందలాది దరఖాస్తులను స్థానిక సంస్థలు, పట్టణ ప్రణాళికా విభాగాలు తిరస్కరించినట్లు సమాచారం. అత్యధికంగా మేడ్చల్, ఘట్‌కేసర్, శంషాబాద్, మహేశ్వరం పరిధిలో ఇలాంటి అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నట్లు హెచ్చరిస్తోంది.
ఇవి పరిశీలించండి..
భాగ్యనగర రియల్టీ రంగానికి ఐటీ ప్రాణ వాయువును అందిస్తే.. తాజా ముసాయిదా మాస్టర్‌ప్లాన్ శివారు ప్రాంతాల్లో కదలికను తెచ్చింది. ముఖ్యంగా ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో.. రెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి వచ్చే స్థలాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించేవారి సంఖ్య పెరుగుతోంది. కాకపోతే వెకనా ముందు చూడకుండా కొంటే మొదటికే మోసం వస్తుంది. హెచ్‌ఎండీఏ తాజా ముసాయిదా మాస్టర్ ప్లాన్ ప్రకారం విస్తరించిన ఏరియాను 12 స్థల వినియోగ జోన్లుగా వర్గీకరించారు. మీరు కొనాలనుకున్న స్థలం ఏయే జోన్ పరిధిలోకి వస్తుంది? రెసిడెన్షియలా? కన్జర్వేషన్ జోనా? అనే విషయాన్ని కనుక్కోండి. అలాగే ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు సంబంధిత లేఅవుట్‌కు నిబంధనల ప్రకారం హెచ్‌ఎండీఏ, స్థానిక సంస్థల నుంచి అనుమతులున్నాయా? లేదా? అనేది రియల్టర్‌ను స్పష్టంగా అడిగి నిర్ధారించుకోవాలి. అనుమతులున్నాయని నిర్వాహకులు చెప్పినా సంబంధిత దస్త్రాలను క్షుణ్నంగా పరిశీలించాలి. ఒకవేళ అనుమతులు ఉన్నా ఆమేరకు స్థలాల విభజన, సామాజిక స్థలాల కేటాయింపు జరిగిందా అనే పరిశీలిన కూడా చేయాలి. హెచ్‌ఎండీఏ కార్యాలయంలోని ప్రణాళిక విభాగంలో సంప్రదించినా ఈ వివరాలు తెలుస్తాయి.
Please subscribe for more updates...!
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
+040 2325 6000
realestate@sakshi.net
© News. All Rights Reserved. Design by sakshi.com