– ఫార్మా సిటీతో రియల్ పరుగులు
– పెద్ద ఎత్తున స్థిరాస్తి వెంచర్లు, విల్లా ప్రాజెక్ట్‌లు
– ఆమన్‌గల్, కందుకూరు, కడ్తాల్, తలకొండపల్లిలో రియల్ బూమ్
సాక్షి, హైదరాబాద్:
హైదరాబాద్ రియల్ రంగ ముఖ చిత్రాన్ని మార్చే దమ్మున్న ప్రాజెక్ట్.. ఫార్మా సిటీ! ఫ్యాబ్ సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లతో ఇప్పటికే జోరుమీదున్న శ్రీశైలం జాతీయ రహదారిలో ఫార్మా సిటీ ఏర్పాటుతో మరింత హుషారొచ్చింది. ఓఆర్‌ఆర్ మీదుగా తక్కువ సమయంలో ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్ సెజ్‌లకు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే వీలుండడంతో కొనుగోలుదారులే కాదండోయ్.. పెట్టుబడిదారులూ శ్రీశైలం రహదారి వైపు దృష్టిసారించారు. దీంతో ఈ ప్రాంతంలో భారీ లే అవుట్లు, వెంచర్లతో పాటూ ప్రీమియం విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలూ వెలుస్తున్నాయి. నిజం చెప్పాలంటే భవిష్యత్తు అభివృద్ధికి, పెట్టుబడికి డోకాలేని ప్రాంతం శ్రీశైలం జాతీయ రహదారే!
హైదరాబాద్ చుట్టూ ఉన్న జాతీయ రహదార్లలో ఒక్క శ్రీశైలం రహదారి మినహా అన్ని దార్లలోనూ స్థిరాస్తి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వరంగల్ హైవేలో చూస్తే.. నగరం నుంచి 50 కి.మీ. వరకూ ఎకరం ధర రూ.కోటి పైనే. ముంబై, బెంగళూరు హైవేల్లోనూ కోటిన్నర పైమాటే. ఇక, షామీర్‌పేట్, శంకర్‌పల్లి రహదారిలో అయితే రూ.2 కోట్లకెక్కువే. మరి, నేటికీ సామాన్య, మధ్యతరగతి అందుబాటులో ఉన్న ప్రాంతమేందయ్యా అంటే.. ఒక్క శ్రీశైలం రహదారి మాత్రమే! ముచ్చర్లలో ప్రతిపాదిత ఫార్మా సిటీ, రీజినల్ రింగ్ రోడ్డులతో సమీప భవిష్యత్తులో శ్రీశైలం రహదారిలో రియల్ పరుగులు పెట్టడం ఖాయమని రియల్టీ నిపుణులు ధీమావ్యక్తం చేస్తున్నారు.
హాట్‌స్పాట్స్ ప్రాంతాలివే..
శ్రీశైలం రహదారిలో కందుకూరు, కడ్తాల్, ఆమన్‌గల్, తలకొండపల్లి, కల్వకుర్తి ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతంలో ధర గజానికి రూ.5 వేల నుంచి 8 వేల వరకున్నాయి. విల్లాల ధరలు రూ.కోటి పైమాటే. 2 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల ధరలు రూ.30 లక్షల నుంచి ఉన్నాయి. ప్రధాన నగరంలో లేదా ఐటీ కేంద్రాలకు చేరువలో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు వెచ్చించే వ్యయంతో శ్రీశైలం రహదారిలో ఏకంగా విల్లానే సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫార్మా సిటీ చుట్టూ అభివృద్ధి..
ఐటీ తర్వాత అధిక శాతం మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించేది ఫార్మా రంగమే. తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫార్మా సిటీ రాకతో శ్రీశైలం రహదారి అభివృద్ధి దశే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఐడీఏ బొల్లారం, పాశమైలారం తదితర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమల వల్ల మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల వరకూ అభివృద్ధి విస్తరించింది. అలాగే గతంలో బేగంపేట్‌లో విమానాశ్రయం ఉన్నప్పుడు సనత్‌నగర్, బోయిన్‌పల్లి వంటి ప్రాంతాలకు ఎలాగైతే అభివృద్ధి చెందాయో.. శంషాబాద్ విమానాశ్రయం శ్రీశైలం రహదారికి చేరువలో ఉండటంతో సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశముందని’’ మాతృభూమి ఫామ్ ల్యాండ్స్ సీఎండీ కొత్త మనోహర్ రెడ్డి తెలిపారు. ఫార్మాసిటీని అనుసంధానిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు కూడా రానుంది. ఇది షాద్‌నగర్ నుంచి తలకొండపల్లి మీదుగా ఫార్మాసిటీకి అనుసంధానమై ఉంటుంది. ఇప్పటికే శ్రీశైలం ర హదారిలో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లున్నాయి. మొత్తంగా స్థిరాస్తి కొనుగోళ్లు, పెట్టుబడులకు శ్రీశైలం రహదారి సరైన ప్రాంతమని నిపుణులు సూచిస్తున్నారు.
లే అవుట్లు, విల్లాలకు డిమాండ్..
శ్రీశైలం రహదారిలో అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లతో పాటూ లే అవుట్లు వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మాతృభూమి, రాంకీ, మ్యాక్, ఫార్చ్యూన్, ప్రజయ్, వీడియోకాన్, విశాల్ వంటి పేరున్న నిర్మాణ సంస్థలతో పాటూ చిన్న సంస్థలూ ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నాయి. కందుకూరు నుంచి ఆదిభట్లకు 15 కి.మీ. దూరం. దీంతో ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్ ఉద్యోగులు శ్రీశైలం రహదారిలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. 30 కి.మీ దూరంలో ఎల్బీనగర్, ఆదిభట్ల ప్రాంతాలుండడంతో విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకూ కొదవేలేదు. కృష్ణా జలాల సరఫరా, విద్యుత్ ఉపకేంద్రంతో మౌలిక వసతులూ మెరుగ్గానే ఉన్నాయి. ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్ర బిందువుగా మారనున్న తలకొండపల్లిలో ప్రస్తుతం ఎకరం రూ.20 లక్షల లోపు ఉన్నది కాస్త సమీప భవిష్యత్తులో కోటి దాటుతుందని అంచనా.
ఏడాదిలో 2 వేల ఎకరాల అభివృద్ధి లక్ష్యం
మాతృభూమి ఫామ్‌ల్యాండ్స్ సీఎండీ కొత్త మనోహర్ రెడ్డి
అభివృద్ధి చెందే ప్రాంతంలో అదీ అందుబాటు ధరల్లో సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా వెంచర్లు చేస్తోంది మాతృభూమి ఫామ్‌ల్యాండ్స్. శ్రీశైలం రహదారిలో 3 భారీ వెంచర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న ఈ సంస్థ.. వచ్చే ఏడాది కాలంలో 2 వేల ఎకరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యించింది. ఆయా ప్రాజెక్ట్ వివరాలను మాతృభూమి ఫామ్ ల్యాండ్స్ సీఎండీ కొత్త మనోహర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు.
– ఆమన్‌గల్‌లో 40 ఎకరాల్లో లే అవుట్ చేస్తున్నాం. ఇందులో మొత్తం 200 ప్లాట్లుంటాయి. 600, 1,200, 2,400 గజాలు. ఇప్పటికే 175 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ధర 605 గజాలకు (5 గుంటలు) రూ.2.5 లక్షలు. ఇందులో రూ.లక్ష విలువైన ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్ వంటి ఎలక్ట్రానిక్స్‌తో పాటూ డైనింగ్ టేబుల్, సోఫా, బెడ్ వంటి ఫర్నీచర్‌ను ఉచితంగా అందిస్తున్నాం.
– 605 గజాల్లోని ఒక్కో ప్లాట్‌లో 25 మలబార్ చెట్లుంటాయి. దానిమ్మ తోట ఉంటుంది. వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ వేస్తాం. సెక్యురిటీ గార్డ్ ఉంటాడు. రెండేళ్ల పాటు చెట్ల పెంపకం, నిర్వహణ బాధ్యత కంపెనీదే.
– కందుకూరులో 30 ఎకరాల్లో మరో వెంచర్‌ను చేస్తున్నాం. మొత్తం 200 ప్లాట్లుంటాయి. 50 శాతం అమ్ముడుపోయాయి. ఇందులో మలబార్ ప్లాంటేషన్ ఉంటుంది. ధర 605 గజాలకు రూ.5.5 లక్షలు. రూ.2 లక్షల విలువైన ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ వస్తువులను ఉచితంగా అందిస్తున్నాం.
– తలకొండపల్లిలో 80 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. మొత్తం 600 ప్లాట్లుంటాయి. ధర 605 గజాలకు రూ.3.5 లక్షలు. రూ.1.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్లను ఉచితంగా అందిస్తున్నాం.
– విజయవాడ రహదారిలోని నకిరేకల్‌లో 40 ఎకరాల్లో లే అవుట్‌ను చేస్తున్నాం. ఇందులో మొత్తం 200 ప్లాట్లుంటాయి. ఇందులో నిమ్మ, బత్తాయి, సపోట తోట ఉంటుంది. ధర 605 గజాలకు రూ.4 లక్షలు. రూ.1.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్లను ఉచితంగా అందిస్తున్నాం.
Please subscribe for more updates...!
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
+040 2325 6000
realestate@sakshi.net
© News. All Rights Reserved. Design by sakshi.com