కొత్త నగరం!

– సరికొత్త సిటీలను నిర్మిస్తున్న బిల్డర్లు
– శాటిలైట్‌ టౌన్‌షిప్‌లుగా మారుతోన్న గ్రామాలు
– ప్లాట్లు, ఫ్లాట్లే కాదు.. విద్య, వైద్యం, మాల్స్, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు అన్నీ ఇక్కడే

సాక్షి, హైదరాబాద్‌:

ఇప్పటివరకు బిల్డర్లు అంటే అపార్ట్‌మెంట్లు, విల్లాలు, డ్యూప్లెక్స్‌లు మాత్రమే నిర్మిస్తారని మనకు తెలుసు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఏకంగా కొత్త నగరాలనే నిర్మిస్తున్నారు. విదేశాల్లో మాదిరిగా గ్రామాలకు గ్రామాలనే కొనేసి శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను రూపొందిస్తున్నారు. ఈ సరికొత్త సిటీల్లో నివాస, వాణిజ్య సముదాయాలే కాదు విద్య, వైద్యం, షాపింగ్‌ మాళ్లు, క్రీడా అకాడమీలు సకలం కొలువుదీరనున్నాయి. దీంతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు అభిప్రాయం. 

2011 జనాభా లెక్కల ప్రకారం.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జనాభా దాదాపు 90 లక్షలు. 2031 నాటికి 1.84 కోట్లకు చేరుకుంటుందని సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్లానింగ్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ అంచనా. అంటే అప్పటి ప్రజల మౌలిక అవసరాలు, ఇళ్ల కొరతను దృష్టిని పెట్టుకొని నగరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి అనేది ఒకే చోటకు పరిమితమైతే అందరూ ఆ వైపే పరుగులు తీస్తారు. దీంతో ఆయా ప్రాంతాలపై ఒత్తిడి పెరిగి అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది. అందుకే నగరం మొత్తం సమాంతరమైన అభివృద్ధి జరగాలని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. అందుకే శాటిలైట్‌ నగరాలను అభివృద్ధి చేస్తే నగరం శరవేగంగా అబివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగం, ట్రాఫిక్, ఇళ్ల కొరత వంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటున్నారు. 

గ్రామాలకు గ్రామాలే..

శాటిలైట్‌ టౌన్‌షిప్‌ వంటి మెగా ప్రాజెక్ట్‌లను నిర్మించాలంటే వేల ఎకరాల్లో స్థలం కావాలి. అందుకే శివారు ప్రాంతాలు, గ్రామాలను పూర్తిగా రియల్‌ వెంచర్లు, మెగా, శాటిలైట్‌ టౌన్‌షిప్‌లతో ముంచెత్తుతున్నారు. ప్రగతి గ్రూప్‌ చిలుకూరు, ప్రొద్దుటూరు, టంగుటూరు, గొల్లగూడెం, గొల్లపల్లి, మేడిపల్లి వంటి 15 గ్రామాల్లోని సుమారు 2 వేల ఎకరాల్లో దశల వారీగా మెగా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ప్రగతి రిసార్ట్స్‌ కొలువుదీరింది. ప్రస్తుతం 200 ఎకరాల్లో లే అవుట్లను అభివృద్ధి పరుస్తున్నారు. రాంకీ ఎస్టేట్స్‌ అండ్‌ ఫామ్స్‌ లిమిటెడ్‌ మహేశ్వరం మండలంలోని శ్రీనగర్‌ గ్రామంలో 600 ఎకరాల్లో డిస్కవరీ సిటీ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ను నిర్మిస్తోంది. ఫార్చూన్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రై.లి. కందుకూరి మండలంలోని దాసర్లపల్లి, కర్తాల్‌ గ్రామాల్లో 3,600 ఎకరాల్లో ‘ఫార్చూన్‌ బటర్‌ఫ్లై సిటీ’ పేరుతో సరికొత్త శాటిలైట్‌ టౌన్‌షిప్‌ను నిర్మిస్తోంది.

అన్నీ ఒక్క చోటే..

శాటిలైట్‌ టౌన్‌షిప్‌లుగా మారుతోన్న గ్రామాల్లో నివాస, వాణిజ్య సముదాయాలతో పాటు ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, వినోదం వంటి సకల సౌకర్యాలూ కల్పిస్తున్నారు. పాతికేళ్ల తర్వాత రాబోయే ప్రజల అవసరాలను ముందుగానే ఊహించి ఆయా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. కేజీ నుంచి పీజీ స్థాయి వరకు అంతర్జాతీయ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్‌ మాళ్లు, ఐటీ, ఫార్మా వంటి అనేక రంగాల కార్యాలయాలు, ఇండోర్, అవుట్‌ డోర్‌ ఆట స్థలాలు, థీమ్‌ పార్క్‌ వంటివెన్నో కొలువుదీరుతున్నాయి. ఇప్పటికే డిస్కవరీ సిటీలో 5 ఎకరాల్లో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ పాఠశాల నడుస్తోంది. అలాగే ఫార్చూన్‌ బటర్‌ఫ్లై ప్రాజెక్ట్‌లో ఫార్చూన్‌ బటర్‌ఫ్లై స్కూల్‌ మూడేళ్లుగా నడుస్తోంది.

శాటిలైట్‌ నగరాలిలా..

– శాటిలైట్‌ నగరాల్లో మెరుగైన రవాణా వ్యవస్థ, రహదారులు, మురుగునీటి వ్యవస్థ, రక్షిత మంచినీరు, పార్కులు, సాంస్కృతిక ఇలా అన్ని రంగాలకు వేదికగా ఉంటాయి.
– నగరం నుంచి సుమారు 100 కి.మీ ల దూరంలో ఉన్న ముఖ్య పట్టణాలు, మండలాలను  శాటిలైట్‌ నగరాలుగా అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తారు.
– శాటిలైట్‌ నగరాల నుంచి రాజధానికి చేరుకునేందుకు ఎంఎంటీఎస్, మెట్రో రైల్ల పరిధిని విస్తరించాలి.
– ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలు, పరిశ్రమలను శాటిలైట్‌ నగరాల్లోనే ఏర్పాటు చేసేలా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలి.
– ప్రతి చిన్న పనికి నగరానికి పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ విభాగాల కార్యాలయాలను శాటిలైట్‌ నగరాల్లో ఏర్పాటు చేయాలి.
– విద్య, వైద్యం, వృత్తి విద్యా కళాశాలలు, శిక్షణ సంస్థలను ఆయా నగరాల్లోనే ఏర్పాటు చేయాలి.

3,600 ఎకరాల్లో ‘ఫార్చూన్‌ బటర్‌ఫ్లై సిటీ’
సాక్షి, హైదరాబాద్‌:
ఇంటి పక్కనే స్కూల్, అనారోగ్యం వస్తే ఆసుపత్రి, వీకెండ్స్‌లో ఎంజాయ్‌ చేయడానికి షాపింగ్‌ మాల్, మల్టీప్లెక్స్‌ ఇలా ప్రతీ ఒక్కటీ ఒక్క ప్రాజెక్ట్‌లోనే ఉంటే ఎంత బాగుంటుంది కాదూ. అచ్చం ఇలాంటి ప్రాజెక్ట్‌నే రూపొందిస్తున్నామని ఫార్చూన్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రై.లి. బీ శేషగిరిరావు సీఎండీ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
– కందుకూరి మండలంలోని దాసర్లపల్లి, కర్తాల్‌ గ్రామాల్లో 3,600 ఎకరాల్లో ‘ఫార్చూన్‌ బటర్‌ఫ్లై సిటీ’ పేరుతో సరికొత్త శాటిలైట్‌ టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నాం. 3 వేల ఎకరాలు నివాస, 600 ఎకరాలు వాణిజ్య సముదాయాల కోసం కేటాయించాం. ఇందులో విద్యా సంస్థల కోసం 300 ఎకరాలు, వైద్యం అవసరాల కోసం వంద ఎకరాలు, వినోద, షాపింగ్‌ మాల్స్‌ కోసం 50 ఎకరాలు, స్పోర్ట్స్‌ అకాడమీ కోసం 25 ఎకరాలు కేటాయించాం. 
– నివాస సముదాయాల విభాగంలో.. 2,500 ఎకరాలు ఓపెన్‌ ప్లాట్స్‌ కోసం, 500 ఎకరాలు విల్లాల కోసం కేటాయించాం. ఇప్పటికే 600 ఎకరాల ప్లాట్లు, సుమారుగా 600లకు పైగా విల్లాలను విక్రయించామంటే ఇక్కడి అభివృద్ధిని, గిరాకీని అర్థం చేసుకోవచ్చు.
– ఆగష్టు 15న సీనియర్‌ సిటీజన్స్‌ కోసమే సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాం. ఫార్చూన్‌ ఎవరెస్ట్‌ పేరుతో మధ్య తరగతి ప్రజల కోసం, ఎన్నారైల కోసం ఫార్చూన్‌ ఎన్నారై టౌన్‌షిప్‌లను కూడా నిర్మిస్తాం. ఇక ధరల విషయానికొస్తే ప్రారంభ ధరలు ఓపెన్‌ ప్లాట్స్‌ అయితే గజానికి రూ.3,500, అలాగే విల్లా రూ.35 లక్షలుగా నిర్ణయించాం.  2018 డిసెంబర్‌ 31నాటికి మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.

Related Articles

© News. All Rights Reserved. Design by sakshi.com