–రెడ్యూస్,రీసైకిల్,రీయూజ్ పద్ధతులపై ఆసక్తి..
–తాగడానికి మినహా ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకునే వీలు..
సిటీబ్యూరో,న్యూస్‌లైన్:
గ్రేటర్‌లో అపార్ట్‌మెంట్‌కో మురుగు శుద్ది కేంద్రం(సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్–ఎస్టీపీ) ఏర్పాటుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. భూగర్భజల నిల్వలు అడుగంటిపోతుండడం,జలాశయాల నీటినిల్వలలు తగ్గుతుండడంతో మురుగునీటిని మంచినీటిగా మార్చి ఇతరత్రా అవసరాలకు వినియోగించుకునే విధానాలపై దృష్టిసారించింది.
కాంక్రీట్ మహారణ్యంలా మారిన మహానగరం పరిధిలో 20 ఫ్లాట్‌లు మించి ఉన్న అపార్ట్‌మెంట్లు,గేటెడ్‌కమ్యునిటీల వద్ద స్థానికుల సహకారంతో ఈ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు బోర్డు వర్గాలు ‘న్యూస్‌లైన్’కు తెలిపాయి. నగరంలో ఇలాంటివి సుమారు 15 వేల వరకు ఉన్నట్లు బోర్డు వర్గాలు గుర్తించాయన్నారు. భూగర్భజలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నెలకొన్న అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు ముందుకొస్తే ఎస్టీపీలను ఏర్పాటుచేస్తామని తెలిపారు. కాగా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో నీటివినియోగాన్ని తగ్గించడం(రెడ్యూస్),వినియోగించిన నీటిని శుద్ధిచేయడం(రీసైకిల్),తిరిగి వినియోగించడం(రీ యూజ్)పద్ధతులను అమలుచేస్తున్నారు. ఈవిధానాన్ని మూడు ‘ఆర్’ల(3ఆర్) విధానంగా పిలుస్తారు.∙
పదిలక్షల ఖర్చుతో మినీ ఎస్టీపీ..
అపార్ట్‌మెంట్ల వద్ద రోజువారీగా రెండువేల కిలోలీటర్ల మురుగు నీటిని(2కేఎల్) శుద్ధిచేసేందుకు ఏర్పాటుచేసే చిన్నపాటి ఎస్టీపీ నిర్మాణానికి సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుంది. ఈ ఎస్టీపీ వద్ద ఏరియేషన్,రివర్స్ ఆస్మోసిస్ విధానాల ద్వారా మురుగునీటిలోని బీఓడీ,సీఓడీ,నురుగు,ఇతరత్రా కలుషిత అనుఘటకాలను తొలగించి మురుగునీటిలో సుమారు 60 శాతం నీరు తిరిగి వినియోగించుకునేలా శుద్ధిచేస్తారు. అంటే వందలీటర్ల మురుగు నీటిని శుద్ధిచేస్తే 60 లీటర్లను తిరిగి వినియోగించుకోవచ్చన్నమాట. కాగా ఈనీరు తాగడానికి పనికిరాదు. కానీ గార్డెనింగ్,బట్టలుతకడం,బాత్‌రూం ఫ్లష్,స్నానం,వాహనాలు శుభ్రపరచడం,ఫ్లోర్‌క్లీనింగ్,ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవచ్చు. మన నగరంలో థర్మాక్స్ వంటి కంపెనీలు ఈటెక్నాలజీని అభివృద్ధిచేసి జలమండలికి ముందు మినీఎస్టీపీల ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది.
వినియోగదారుల సహకారమే కీలకం..!
ఎస్టీపీ నిర్మాణానికి జలమండలి సాంకేతిక సహకారమే అందిస్తుంది. నిర్మాణానికయ్యే వ్యయాన్ని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వినియోగదారులే భరించాలి. ఇప్పటికే నీటిబిల్లులు,ఇంటిపన్నులు,కరెంట్‌బిల్లుల మోతతో సతమతమౌతున్న వినియోగదారులు ఎస్టీపీల నిర్మాణానికి ఏమేర ముందుకొస్తారన్నది సందేహాస్పదంగా మారింది. వీటి నిర్మాణానికయ్యే వ్యయంలో జలమండలి సగం వ్యయాన్ని సమకూరిస్తే మిగతా మొత్తాన్ని ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు భరించే ప్రతిపాదనను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎస్టీపీలతో ఉపయోగాలివే...
–భూగర్భజలాల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఎస్టీపీల నిర్మాణంతో నీటిఎద్దడి గణనీయంగా తగ్గుతుంది. వాడుకునే నీటికి కొరత ఉండదు.
–మినీ ఎస్టీపీల్లో శుద్ధిచేయగా మిగిలిన నీటిని భూగర్భంలోకి మళ్లించి భూగర్భజల నిల్వలు పెంచవచ్చు.
–జలమండలి ట్యాంకర్ నీటికోసం ఎదరుచూసే అవస్థలు తప్పుతాయి.
–ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ నుంచి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే ఐదువేల లీటర్ల నీటి ట్యాంకర్‌కే రూ.1000 చెల్లించాల్సిన దుస్థితి తప్పుతుంది.
–గార్డెనింగ్,గ్రీన్‌బిల్డింగ్‌లు,చిన్నపార్కుల నిర్వహణకు నీటికొరత ఉండదు.పచ్చదనానికి కొదవుండదు.
–పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లలో మినీ ఎస్టీపీల నిర్మాణంతో నగరంలో మురుగునీటి ప్రవాహం గణనీయంగా తగ్గుతుంది. మూసీలోకి ప్రవహించే మురుగు ప్రవాహం తగ్గుతుంది. మూసీ ప్రక్షాళన మరింత సులువు అవుతుంది. చారిత్రక నదిని పరిరక్షించినవారవుతాం.
–లోతట్టు ప్రాంతాల్లో భూమిలోపల సుమారు 1500 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేసి డీప్‌ట్యూబ్‌వెల్స్‌ను ఏర్పాటుచేసి ఎస్టీపీల్లో శుద్ధిచేసిన నీటిని వీటిల్లోకి మళ్లిస్తే భూగర్భ జలాల రీఛార్జీ సులువు అవుతుంది. మండువేసవిలో బోరుబావులు ఎండిపోయే దుస్థితి తప్పుతుంది.
Please subscribe for more updates...!
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
+040 2325 6000
realestate@sakshi.net
© News. All Rights Reserved. Design by sakshi.com