– అపార్ట్‌మెంట్ తరహాలో ప్లాట్లకూ చెల్లిస్తామని హామీ
– బై బ్యాక్, రెంటల్ స్కీమ్‌ల పేరుతో ప్రచారం
– ఏడాదిలో అద్దెతో సహా కట్టిన సొమ్ము రిటర్న్
– లేకపోతే ఆ స్థలం కొనుగోలుదారునికేనని ఒప్పందం
– ముందే వంద శాతం రేటు పెంచేసి విక్రయిస్తున్న బిల్డర్లు
– సరికొత్త మోసాలకు తెర తీసిన నిర్మాణ సంస్థలు
సాక్షి, సిటీబ్యూరో:
‘‘హైదరాబాద్ నుంచి 140 కి.మీ. దూరంలో ఉన్న నారాయణ్‌ఖేడ్‌లో ఓ నిర్మాణ సంస్థ ఫామ్‌ల్యాండ్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నామని ప్రచారం చేస్తుంది. రెండు గుంటలు (242 గజాలు)కు రూ.3 లక్షలు చెల్లిస్తే.. ప్రతి నెలా రూ.15 వేల అద్దె చొప్పున 20 నెలల్లో తర్వాత మొదట్లో కట్టిన రూ.3 లక్షలుతో సహా మొత్తం రూ.6 లక్షలు కొనుగోలుదారునికి చెల్లిస్తుంది. అలాగే 4 గుంటల స్థలానికి రూ.6 లక్షలు చెల్లిస్తే.. ప్రతి నెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ.12 లక్షలు, అలాగే 8 గుంటలకు రూ.12 లక్షలు కడితే.. నెలకు రూ.24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్ చేస్తుంది.’’
.. ఇలా అపార్ట్‌మెంట్లకు ప్రతి నెలా అద్దె చెల్లించినట్లుగానే ఓపెన్ ప్లాట్లకు, ఫామ్‌ల్యాండ్లకు కూడా రెంట్ చెల్లిస్తామని కొత్త తరహా మోసాలకు తెరలేపారు పలువురు బిల్డర్లు. ఇప్పటికే గృహ నిర్మాణంలో ప్రీలాంచ్ విక్రయాల పేరిట జరిగిన దందాలో మోసపోయిన కొనుగోలుదారుల పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. కొత్తగా బై బ్యాక్, రెంటల్ ఇన్‌కం, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి సరికొత్త ఆఫర్ల పేరిట అమాయకులను నట్టేల ముంచేస్తున్నారు.
ఫామ్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తూ సామాన్యులను నిలువునా ముంచేస్తున్నారు. ఏడాదిలో అద్దె్డతో సహా కట్టిన సొమ్మును వాపసు ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. ఒకవేళ ఏడాది తర్వాత మార్కెట్ ఒడిదుడుకులలో ఉన్నా లేక కంపెనీ బోర్డు తిప్పేసినా నష్టపోయేది కొనుగోలుదారుడే. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం గజానికి రూ.5 వేలు కూడా పలకని ప్రాంతంలో రూ.10 వేలకు పైగానే ధరతో విక్రయించి.. ముందస్తుగానే బిల్డర్లు సొమ్ము వసూలు చేసేస్తున్నారు.
– కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్‌ఫ్రాకాన్, జయ గ్రూప్, ఫార్చ్యూన్ 99 వంటి పలు కొత్త నిర్మాణ సంస్థలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. డీటీసీపీ, హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు చేయకుండానే వెంచర్లను విక్రయిస్తున్నారు. సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి ప్రధాన నగరం నుంచి వందకు పైగా కి.మీ. దూరంలో ఉన్న శివారు ప్రాంతాలలో ఈ తరహా ప్రాజెక్ట్‌లు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి.
రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నారు.
నమ్మకస్తులే మధ్యవర్తులుగా..
గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతి నెలా స్టార్ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు.
మార్కెట్‌ను చెడగొడుతున్నారు
– బీ సునీల్ చంద్రారెడ్డి, ప్రెసిడెంట్, నరెడ్కో తెలంగాణ
ప్రభుత్వ సానుకూల నిర్ణయాలతో సాఫీగా సాగుతున్న రియల్టీ మార్కెట్‌ను స్కీమ్‌ల పేరుతో చెడగొడుతున్నారు. హైదరాబాద్‌లో స్థలం కొనుక్కోవాలని సామాన్యుల ఆశలను ఆసరా చేసుకొని కొందరు బిల్డర్లు వల విసురుతున్నారు. రెంటల్ గ్యారంటీ, బై బ్యాక్ అంటూ రకరకాల స్కీమ్‌లతో ప్రజలను మోసం చేస్తున్నారు. స్కీమ్‌ల పేరుతో విక్రయించే స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
Please subscribe for more updates...!
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
+040 2325 6000
realestate@sakshi.net
© News. All Rights Reserved. Design by sakshi.com