– 2017లో 2.6 మి.చ.అ.ల్లో 8 మాల్స్ ప్రారంభం
– 2.5 మి.చ.అ.తో చెన్నై, 2.3 మి.చ.అ.తో ముంబై ఆ తర్వాతి స్థానాల్లో
సాక్షి, హైదరాబాద్:
2017 భాగ్యనగరి వాసుల్లో మరింత జోష్ నింపనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 2.6 మిలియన్ చ.అ.ల్లో 8 షాపింగ్ మాల్స్ అందుబాటులోకి రానున్నాయి మరి. 2017లో అత్యధిక మాల్స్ స్పేస్ అందుబాటులోకి వచ్చే నగరంలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందని కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ నివేదిక తెలిపింది.
– నగరంలోని వాయువ్య భాగంలోని కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్ ప్రాంతాల్లో ఆయా మాల్స్ అందుబాటులోకి రానున్నాయి. పెట్టుబడిదారులు నాణ్యమైన రిటైల్ స్పేస్ దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి అవకాశంగా భావిస్తున్నారని.. అందుకే గతేడాదితో పోల్చితే 2017లో ఎక్కువ సంఖ్యలో షాపింగ్ మాల్స్ రావటానికి కారణమని నివేదిక పేర్కొంది.
– దేశంలో గత కొంత కాలంగా రిటైల్ స్పేస్ వృద్ధి చెందుతుండటంతో సంస్థాగత పెట్టుబడిదారులు ఈ రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ ఇండియా ఎండీ అన్షుల్ జైన్ తెలిపారు. దీంతో నిర్మాణ సంస్థలూ మాల్స్ నిర్మాణాలకు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. దేశంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్స్) పెట్టుబడులు ప్రారంభమాయ్యక మాల్స్ రంగం మరింత వృద్ధి చెందుతుందని అంచనా వేశారు.
– హైదరాబాద్ తర్వాత చెన్నై, ముంబై తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2017లో చెన్నైలో 2.5 మిలియన్ చ.అ. స్థలంలో వండలూర్, నవలూర్ వంటి పలు ప్రాంతాల్లో మాల్స్ రానున్నాయి. ముంబైలో 2.3 మిలియన్ చ.అ.ల్లో మాల్స్ వస్తున్నాయి.
– ఆశ్చర్యకరంగా బెంగళూరులో మాల్స్ రాక గణనీయంగా తగ్గిపోయింది. 2017లో ఇక్కడ 2 మిలియన్ చ.అ.ల్లో మాల్స్ రానున్నాయి. ఆ తర్వాత పుణెలో 0.4 మిలియన్ చ.అ.ల్లో, కోల్‌కత్తాలో 0.3 మిలియన్ చ.అ.ల్లో, అహ్మదాబాద్‌లో 0.2 మిలియన్ చ.అ.ల్లో, ఎన్‌సీఆర్‌లో 0.2 మిలియన్ చ.అ.ల్లో షాపింగ్ మాల్స్ రానున్నాయి.
నగరంలో ముస్తాబవుతోన్న మాల్స్!
ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించే షాపింగ్ మాల్స్‌లో కొన్ని 2017 ముగింపు నాటికి అందుబాటులోకి రానున్నాయి. వీటిలో షాపింగ్‌తో పాటు సుమారుగా 20 స్క్రీన్ల వరకు మల్టీప్లెక్స్‌లు కూడా ఉంటాయి.
– శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ 16.88 లక్షల చ.అ.ల్లో నగరంలో 4 షాపింగ్ మాల్స్ అండ్ మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తోంది. ప్యాట్నీ సెంటర్‌లో 9 లక్షల చ.అ.ల్లో ప్యాట్నీ మాల్ రానుంది. ఇందులో 4 స్క్రీన్ల మల్టీప్లెక్స్ కూడా ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ 4.75 లక్షల చ.అ.ల్లో ఓడియన్, 2.10 లక్షల చ.అ.ల్లో సుదర్శన్ మాల్ అండ్ మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తోంది. వీటిల్లోనూ మల్టీప్లెక్స్‌లుంటాయి. బేగంపేటలో 1.03 లక్షల చ.అ.ల్లో బ్లూ మూన్ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తోంది.
– ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ మియాపూర్ క్రాస్ రోడ్‌లో ఎస్‌ఎంఆర్ వినయ్ మాల్‌ను నిర్మిస్తోంది. 1.50 లక్షల చ.అ.ల్లో రానున్న ఈ మాల్‌లో షాపింగ్ స్పేస్‌తో పాటూ 4 స్క్రీన్ల మల్టీప్లెక్స్ కూడా ఉంటుంది.
‘మెట్రో’ల్లోనూ మాల్స్..
– హైదరాబాద్‌లో ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో రైలుతో పాటూ మెట్రో స్టేషన్లు, డిపోలు, సమీప ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్‌ను కూడా నిర్మిస్తోంది. 1.85 కోట్ల చ.అ. రిటైల్ స్థలంలో తొలి దశలో 60.5 లక్షల చ.అ. మేర నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో 10.1 లక్షల చ.అ. స్థలం 2017లో అందుబాటులోకి రానుంది. ఎర్రమంజిల్, పంజగుట్ట, హైటెక్ సిటీల్లో నిర్మిస్తున్న మాల్స్ 2017లో అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద భాగ్యనగరి షాపింగ్ ప్రియులకు 2017 మాల్స్ పండగలా మారునుందన్నమాట.
Please subscribe for more updates...!
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
+040 2325 6000
realestate@sakshi.net
© News. All Rights Reserved. Design by sakshi.com